నిప్పుతో చెలగాటమాడే కొలువులు

490
నిప్పుతో చెలగాటమాడే కొలువులు

వేసవికాలం వస్తే.. పేపర్ల నిండా అగ్నిప్రమాదాల వార్తలే. అలాంటి విపత్తులు సంభవించకుండా కొందరు ముందు జాగ్రత్తలు చర్యలు కూడా తీసుకుంటుంటారు. కొన్ని కోర్సులు చేయడం, శిక్షణ తీసుకోవడం వల్ల అది వారికి సాధ్యమవుతుంది. ప్రజారక్షణలో భాగస్వాములు కావాలనుకునే వారు ఇలాంటి ఫైర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చేయవచ్చు. మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.

చిన్న పొరపాటు, కాస్త నిర్లక్ష్యం పెద్ద అగ్నిప్రమాదాలకు కారణమవుతుంటాయి. భారీ ఆస్తి నష్టమే కాదు, అమూల్యమైన ప్రాణాలూ పోగోట్టుకోవాల్సి వస్తుంది. కారణాలు ఏమైనా గతంతో పోలిస్తే అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగింది. దాంతో ముందు జాగ్రత్తలతో వీటిని నివారించే అగ్నిమాపక సిబ్బందికీ డిమాండ్‌ పెరుగుతోంది. అగ్నిప్రమాదాలను నిరోధించే నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. అగ్ని ప్రమాదాలు సంభవించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి, అవి రాకుండా ముందు జాగ్రత్తగా ఫైర్‌ ఇంజినీర్లు కొన్ని చర్యలు తీసుకుంటారు. వీరి ఆధ్వర్యంలోనే ఇతర సిబ్బందీ పనిచేస్తుంటారు. ఫైర్‌ ఇంజినీర్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి స్థితిలో గాయాలపాలు కావచ్చు లేదా ప్రమాదకర రసాయనాలు మీద పడటం వల్ల కూడా ఒళ్లంతా కాలిపోవచ్చు. అందుకే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎక్కువ గంటలపాటు పనిచేయడానికి సహనం, నమ్మకం, సామర్థ్యం కావాలి.

కోర్సులు 
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (ఫైర్‌): నాగ్‌పుర్‌లోని నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజ్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ) బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (ఫైర్‌)లో డిగ్రీ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. ఏటా అఖిల భారత స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్‌ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. సీట్ల సంఖ్య 60. వయసు 19 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 165 సెం.మీ. పొడవు, 50 కేజీల బరువు ఉండాలి. మహిళలైతే 157 సెం.మీ.పొడవు, 46 కేజీల బరువూ ఉండాలి. కంటి చూపు 6/6 ఉండాలి. ఫిజికల్‌ అండ్‌ మెడికల్‌ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

కోర్సు- సబ్‌ ఆఫీసర్స్‌: గ్రాడ్యుయేట్‌/ డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ అర్హత ఉన్నవారు ఈ కోర్సు చేయవచ్చు. సీట్ల సంఖ్య 30. దీని ప్రవేశానికి మాత్రం జాతీయస్థాయిపరీక్ష నిర్వహించి అడ్మిషన్‌ ఇస్తారు.

వెబ్‌సైట్‌: www.nfscnagpur.nic.in

ఫైర్‌లో మరికొన్ని సంస్థలు ఇంజినీరింగ్‌ పట్టాను అందిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. 
* నూరుల్‌ ఇస్లామ్‌ యూనివర్సిటీ, కన్యాకుమారి. 
* కొచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కొచ్చి. 
* ది నియోటియా కాలేజ్, కోల్‌కతా. 
* చండీగఢ్‌ యూనివర్సిటీ. 
* బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌), హైదరాబాద్‌.

జేఈఈ మెయిన్‌ స్కోరు లేదా ఆయా సంస్థల నిబంధనల ప్రకారం వీటిలో సీట్లు కేటాయిస్తారు.

కెరియర్‌ వివరాలు
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వ/ ప్రభుత్వేతర సంస్థ ఫైర్‌ ఇంజినీర్‌ను తప్పనిసరిగా నియమించాలి. ఫైర్‌ స్టేషన్లలోనే కాకుండా ఆర్కిటెక్చర్, నిర్మాణ రంగం, బీమా అంచనా, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, చమురు శుద్ధి కర్మాగారాలు, ప్లాస్టిక్, ఎల్‌పీజీ గ్యాస్, రసాయన పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, ఎయిర్‌క్రాఫ్ట్‌ మొదలైన చోట్ల వీరికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. బీమా సంస్థలు ఫైర్‌ ఇంజినీర్లను ఇన్స్యూరెన్స్‌ సర్వేయర్‌ పేరుతో నియమిస్తున్నాయి. వీరికి ప్రారంభంలోనే ఏడాదికి సుమారు రూ.మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వేతనం ఇస్తున్నారు. యూరప్, జర్మనీ వంటి దేశాల్లోనూ ఉపాధి దొరుకుతోంది.

డిప్లొమా కోర్సులు: ఫైర్‌ అండ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. ఇంటర్‌ సైన్స్‌/కామర్స్‌/ఆర్ట్స్‌ పాసైనవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి చదివే విద్యా సంస్థను బట్టి ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది.

అర్హత: ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే ప్రవేశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష లేదు. కోర్సు ఫీజు రూ.20,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది.

ఈ డిప్లొమాను 
* మాధవ్‌ యూనివర్సిటీ, సింఘానియా యూనివర్సిటీ, రాజస్థాన్‌ 
* ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో), న్యూదిల్లీ. 
* పసిఫిక్‌ యూనివర్సిటీ, ఉదయ్‌పూర్, రాజస్థాన్‌. 
* రాయల్‌ పీజీ కాలేజ్, ఉత్తర్‌ప్రదేశ్‌. 
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ ఇంజినీరింగ్, నాగ్‌పుర్‌. 
* అరుణాచల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీస్, అపెక్స్‌ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, అరుణాచల్‌ప్రదేశ్‌. 
* లండన్‌ అమెరికన్‌ సిటీ కాలేజ్, బెంగళూరు, కర్ణాటక. 
* ఎన్‌ఐఎఫ్‌ఎస్‌ – ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌ 
* ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్, గ్రీన్‌ వరల్డ్, హైదరాబాద్‌ వంటి సంస్థలు అందిస్తున్నాయి.

Soruce: Eenadu

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here