Telangana Liberation Day History – తెలంగాణ విమోచన దినోత్సవం

366

Telangana Liberation Day -History

తెలంగాణ విమోచన దినోత్సవం


తెలంగాణ విమోచన దినోత్సవం నిజాం కబంధ హస్తాల నుండి హైదరబాదు సంస్థానం విముక్తిపొందిన సెప్టెంబరు 17ను రోజును తెలంగాణ విమోచన లేదా విలీన దినంగా పాటిస్తారు.
చరిత్ర
1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్భలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని గురేస్తానని విర్ర వీగాడు.ఇలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు ఉస్మాన్ అలీఖాన్. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కంతిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు.. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. గోళ్ళ కింద గుండుసూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు. సిగరెట్లతో కాల్చేవారు. బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసేవారు. చెవులకు బరువులు కట్టడం, ఛాతీపై పెద్దబండలు పెట్టడ, కాగే నూనెలో వేళ్లు ముంచడం ఆనాడు సాధారణమైన శిక్షలు ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కొనేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి, అందినకాడికి దోచుకొనేవారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ అందించాడు.తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరితీశారు, గాలిపెల్లిని తగులబెట్టారు చెట్లకు కట్టేసి కింద మంటలు పెట్టేవారు1942లో షేక్ బందగి విస్నూర్ రాపాక రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్యచేశారు.
భారతదేశంపై పోరాటానికి విదేశాల నుంచి ఆయుధ దిగుమతికి ప్రయత్నాలు చేశాడు. అయినా అతని ఆటలు, నిజాం ప్రధాని లాయక్‌అలీ నాటకాలు పటేల్ ఎదుట పనిచేయలేవు. పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచారసాధనాలు తెగిపోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళబేరానికి దిగాడు. లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదను మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోకతప్పలేదు. బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తలవంచి లొంగిపోవడంతో 1948 సెప్టెంబరు 17న హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. అప్పుడు ఇక్కడి ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం లభించింది. నిజాం ప్రధాని లాయక్‌అలీని తొలిగించడమే కాకుండా ప్రజలకు నరకయాతన చూపించిన ఖాసింరజ్వీని అరెస్టు చేశారు నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు. జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్య మొదలైంది. సైన్యం రెండు భాగాలుగా విడిపోయి విజయవాడ నుంచి ఒకటి, బీదర్ దిశగా రెండోది కలిసింది. మొదటి రెండు రోజులు నిజాం సైన్యం తిరగబడినా ఆ తర్వాత క్షీణించింది. తాను ఓటమి అంచుల్లో ఉన్నట్లు గమనించి నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో లేక్‌వ్యూ అతిథి గృహంలో బంధించిన భారత ఏజెంట్ మున్షీని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దీనితో ఆపరేషన్ పోలో విజయవంతమైంది.సెప్టెంబర్ 13న జె.ఎన్.చౌదరి నాయకత్వాన ప్రారంభమైన దాడి సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోవడంతో ఆపరేషన్ పోలో పేరుతో చేపట్టిన చర్య పూర్తయింది.సెప్టెంబర్ 18న సైనిక చర్యకు నేతృత్వం వహించిన జె.ఎన్.చౌదరి సైనిక గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేశాడు. ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here